: పెట్రోల్ నింపుకోండి... ఉచితంగా భోజనం చేయండి... బెంగళూరులో ఓ పెట్రోల్ పంప్ ఆఫర్!
ఈ రోజుల్లో పని ఒత్తిడి కారణంగా భోజనం సంగతిని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండే బెంగళూరు లాంటి సిటీల్లో అసలు ఉద్యోగులు భోజనం ఎప్పుడు చేస్తున్నారో తెలియని పరిస్థితి. వారి కోసమే బెంగళూరులోని మద్రాస్ రోడ్‌లో ఉన్న వేంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఉచిత భోజన ఆఫర్ ప్రవేశపెట్టింది.
`వేళాపాళా లేని భోజనాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వారు ఎంత బిజీగా ఉన్నా పెట్రోల్ పంప్ దగ్గర మాత్రం నిరీక్షించాల్సిందే కదా! ఆ ఐదు నిమిషాల సమయంలోనే మేం రుచికరమైన భోజనాన్ని పార్శిల్ చేసి ఇస్తాం` అని పెట్రోల్ పంప్ యజమాని ప్రకాశ్ రావ్ తెలిపారు. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి సౌజన్యంతో ఈ సదుపాయాన్ని కల్పించినట్లు ఆయన తెలిపారు. ఒక నెలరోజుల పాటు ఇలా ఉచితంగా అందజేసి, తర్వాత సాధారణ రేట్లకు విక్రయిస్తామని ప్రకాశ్ రావ్ చెప్పారు.
ఇలా ఉచితంగా పంపిణీ చేయడం వల్ల వచ్చే నష్టాలను ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ భరిస్తుందని, నష్టాల గురించి బెంగలేదని, ఈ ఆఫర్‌కి ప్రాచుర్యం తీసుకురావడమే వారి ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్ కొట్టించుకున్నవారికి ఉచితంగా, బయట వారికి డబ్బులకు ఆహారాన్ని అందజేస్తున్నట్లు ప్రకాశ్ రావ్ చెప్పారు. త్వరలోనే 100కి పైగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుల్లో ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.