: కర్ణాటకలో బీజేపీ నిరసన ర్యాలీ... మాజీ సీఎం యడ్యూరప్ప అరెస్ట్!
కర్ణాటకలో అత్యంత సున్నిత ప్రాంతమైన దక్షిణ కన్నడ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ హత్యలు చేస్తోందని ఆరోపిస్తూ, మంగళూరులో బీజేపీ మెగా ర్యాలీని నిర్వహిస్తున్న వేళ, నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతానికి వచ్చారని ఆరోపిస్తూ, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నిరసనకు అనుమతి ఇచ్చిన పోలీసులు, నిరసనల్లో యడ్యూరప్ప, ఇతర బీజేపీ నేతలు పాల్గొనేందుకు మాత్రం అంగీకరించలేదు. వారు వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. నగర శివార్లను మూసేశారు.
ఇక నేతలు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నించగా, వారిని అరెస్ట్ చేశామని అధికారులు తెలిపారు. గడచిన రెండు సంవత్సరాల వ్యవధిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పార్టీలకు చెందిన 12 మందిని దారుణంగా హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హత్యలపై సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాఫ్తు జరిపించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. కాగా, నగరంలోని నెహ్రూ మైదానంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సభ నిర్వహించుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని, నిబంధనలకు విరుద్ధంగా నిరసనకారులు బైక్ ర్యాలీ నిర్వహించారని, బయటి వారు పాల్గొనరాదని చెప్పినా వినలేదని, అందువల్లే అరెస్ట్ లు చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.