: మరణించినా మరొకరికి జీవితాన్నిచ్చిన గౌరీ లంకేశ్... ఆఖరి కోరికను తీర్చిన సోదరుడు
రెండు రోజుల క్రితం బెంగళూరులోని తన నివాసంలో పాశవికంగా హత్య చేయబడిన సీనియర్ పాత్రికేయురాలు, సామాజిక ఉద్యమకారిణి గౌరీ లంకేశ్ ఆఖరి కోరికను ఆమె సోదరుడు ఇంద్రజిత్ లంకేశ్ తీర్చారు. తాను చనిపోయిన తరువాత తన కళ్లను దానం చేయాలన్న ఆమె కోరిక మేరకు, బెంగళూరులోని మింటో ఆప్తాల్మిక్ ఆసుపత్రికి కళ్లను దానం చేశామని ఆయన వెల్లడించారు. తమ కుటుంబం ఎంతో బాధలో ఉన్న వేళ, అక్క కళ్లను దానం చేయడం ద్వారా, మరొకరికి జీవితాన్ని ఇచ్చిన ఆనందం ఉందని తెలిపారు. కాగా, గౌరీ లంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా పాత్రికేయ సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా ఆమె ఇంటిముందున్న సీసీటీవీ కెమెరాలను డీకోడ్ చేసిన సిట్ బృందం, ఆ ప్రాంతంలోని 100కు పైగా కెమెరాల ఫుటేజ్ ని స్వాధీనం చేసుకుంది.