: రైల్వేలకు మంత్రి మారినా... ప్రమాదాల తీరు మారలేదు.. పట్టాలు తప్పిన శక్తికుంజ్ ఎక్స్ ప్రెస్!


రైల్వే శాఖా మంత్రిగా సురేష్ ప్రభు నుంచి పీయుష్ గోయల్ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలి ప్రమాదం ఈ ఉదయం జరిగింది. హౌరా నుంచి జబల్ పూర్ వెళ్లే శక్తి కుంజ్ ఎక్స్ ప్రెస్ సోన్ బాంద్రా వద్ద ప్రమాదానికి గురైంది. రైలుకు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో మృతులు, గాయపడిన వారి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. పట్టాలు విరిగిపోయి ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ఘటన వెనుక ఏమైనా సంఘ విద్రోహశక్తుల ప్రమేయం ఉండివుండవచ్చని అనుమానిస్తున్నారు.

ఇటీవలి కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్న ఉత్తర ప్రదేశ్ లోనే ఈ ప్రమాదమూ జరగడం గమనార్హం. వరుస రైలు ప్రమాదాలు, మరణాల సంఖ్య అధికంగా ఉండటంతో సురేష్ ప్రభు తనను ఆ శాఖ నుంచి తప్పించాలని కోరడంతో ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ తరువాత రైల్వే శాఖ బాధ్యతలను గోయల్ కు అప్పగించిన సంగతి విదితమే. ప్రమాదంపై ఆరా తీసిన పీయుష్ గోయల్, రైల్లోని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రమాదంతో ఆ మార్గంలో పలు రైళ్లు నిలిచిపోయాయి. కొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News