: ‘ఫేస్ బుక్’ అకౌంట్ కూ నామినీ కావాలంటే.. ‘లెగసీ కాంటాక్టు’ తప్పనిసరి.. ఆ వివరాలు ఇవిగో!


యువతే కాదు.. అన్ని వయసుల వారూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఎంతో బిజీబిజీగా ఉంటున్న రోజులివి! ‘ఫేస్ బుక్’లో పోస్ట్ చూడకపోయినా, చేయకపోయినా ఆ రోజు ఏదో వెలితిగా ఉన్నట్టు భావించే వాళ్లకు కొదవలేని రోజులివి. సరే, అసలు విషయమేంటంటే..  ‘ఫేస్ బుక్’ యూజర్ తన అకౌంట్ ను కొనసాగించినంత వరకూ ఏ సమస్యా ఉండదు. ఒకవేళ, అతను/ఆమె మృతి చెందితే, ఆ అకౌంట్ ఏమవుతుంది? మరుగున పడిపోతుందా? యాక్టివ్ గా లేని కారణంగా ఆ అకౌంట్ ను సంస్థ డిలీట్ చేస్తుందా?.. ఏమవుతుందనే యూజర్ల అనుమానాలకు ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు స్పందించారు.

‘ఫేస్ బుక్’ యూజర్ కనుక ఒకవేళ మృతి చెందితే అలాంటి వారి కోసం ఓ ప్రత్యేక సదుపాయం కల్పించారు. దాని పేరే ‘లెగసీ కాంటాక్టు’. లెగసీ కాంటాక్టు అంటే  ‘నామినీ’ అని చెప్పవచ్చు. యూజర్ మృతి చెందిన తర్వాత అతని/ఆమె అకౌంట్ ను లెగసీ కాంటాక్ట్ దారుడు ఆపరేట్ చేయవచ్చు. అయితే, తాము చనిపోయిన తర్వాత తమ అకౌంట్ కొనసాగాలా? వద్దా? అనే విషయాన్ని యూజర్లు ఈ లెగసీ కాంటాక్ట్ ఫీచర్ ద్వారా ముందుగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మరణానంతరం తన అకౌంట్ కొనసాగించవద్దు అనే ఆప్షన్ ను కనుక యూజర్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ యూజర్ మరణానంతరం ఆ విషయాన్ని వారి బంధువులు, స్నేహితులు ‘ఫేస్ బుక్’కు ఓ రిక్వెస్ట్ ద్వారా తెలియజేస్తే ఆ అకౌంట్ డిలీట్ అయిపోతుంది. యూజర్ ఎవరైనా చనిపోతే వారి ఖాతా ప్రొఫైల్ లో రిమెంబరింగ్ అనే మెసెజ్ వస్తుంది. ఈ మెసెజ్ రావాలంటే..ఆ వ్యక్తికి చెందిన ‘ఫేస్ బుక్’ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపించాలి. అందుకుగానుhttps://www.facebook.com/help/contact/228813257197480 సైట్ లోకి వెళ్లి వివరాలు నింపాలి. ఆ రిక్వెస్ట్ ను ‘ఫేస్ బుక్’ ఓకే చేస్తే  ఆ వ్యక్తి అకౌంట్ ‘మెమొరలైజ్డ్ టైమ్ లైన్’గా కనిపిస్తుంది.

ఒకవేళ, తాను మరణించినా తన అకౌంట్ కొనసాగాలని యూజర్ భావిస్తే కనుక.. లెగసీ కాంటాక్ట్ లో ఇచ్చిన ఐడీ ప్రకారం సంబంధిత వ్యక్తులు ఆ అకౌంట్ ను నిర్వహించవచ్చు. అయితే, కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఆ అకౌంట్ కి సంబంధించిన పూర్తి హక్కులు మాత్రం ఆ వ్యక్తికి ఉండవు. కేవలం, ఆ అకౌంట్ కు చెందిన ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసెజ్ వంటివి మార్చవచ్చు. ఫ్రెండ్స్ రిక్వెస్ట్ లకూ స్పందించవచ్చు. టైమ్ లైన్ లో ఆ యూజర్ ను మిస్ అవుతున్నామని ఏదైనా పోస్ట్ చేయవచ్చని, అయితే, పాతపోస్ట్ లను, ఇమేజ్ లను తొలగించే అధికారం ఆ నామినీకి ఉండదని ‘ఫేస్ బుక్’ ప్రతినిధులు పేర్కొన్నారు.

లెగసీ కాంటాక్ట్ ను ఎలా యాడ్ చేసుకోవాలంటే.. యూజర్ తన అకౌంట్ లోకి వెళ్లి.. సెట్టింగ్స్- జనరల్- మేనేజ్ అకౌంట్-ఎడిట్ ఆప్షన్ లోకి వెళితే.. ‘యువర్ లెగసీ కాంటాక్ట్ చాయిస్’ ఆప్షన్ కనపడుతుంది. అందులో, యూజర్ కు ఫ్రెండ్స్ గా ఉన్న వారిలో ఎవరినైనా ఎంచుకోవాలి. అక్కడే కింద ఉండే ‘రిక్వెస్ట్ అకౌంట్ డిలిషన్’ ఆప్షన్ న్ ను యూజర్ ఎంచుకుంటే అతను మృతి చెందాక తన ఫ్రెండ్స్ నుంచి ‘ఫేస్ బుక్’కు అందే మెసెజ్ ఆధారంగా ఆ యూజర్ అకౌంట్ ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది.  

  • Loading...

More Telugu News