: అది నా సంతకం కాదని తెలుసుకుని, అతడిని నిలదీశాను: మంత్రి అఖిల ప్రియ
ఈ రోజు సచివాలయంలో అలీ అనే వ్యక్తి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తన సంతకాన్ని ఆ వ్యక్తి ఫోర్జరీ చేసిన అంశంపై మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ... ఉద్యోగం కోసం తాను సిఫార్సు చేశానని చెప్పి, అలీ అనే వ్యక్తి సచివాలయంలో అధికారుల వద్దకు వెళ్లాడని, వారు నిరాకరించడంతో, తన ఛాంబర్‌కి వచ్చి సంతకం పెట్టమని కోరాడని చెప్పారు. సంతకం పెట్టే ముందు అతడి వద్ద ఉన్న అన్ని పత్రాలను చెక్ చేశానని, అయితే, తాను ఉద్యోగానికి సిఫార్సు చేసినట్లు అప్పటికే ఓ పత్రంలో తన సంతకం ఉందని చెప్పారు. అంతేగాక, దానిపై తన మినిస్ట్రీ స్టాంపు కూడా ఉందని చెప్పారు.
దాంతో అది తన సంతకం కాదని తెలుసుకుని, అతడిని నిలదీశానని అఖిల ప్రియ అన్నారు. ఇంతకు ముందు ఆ వ్యక్తి నంద్యాలలో తిరుగుతూ కనిపించాడని అన్నారు. నిందితుడిని పోలీస్ లకు అప్పజెప్పామని అన్నారు. ఇటువంటి వ్యక్తులు చేసే పనుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు.