: పీ3తో ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు చెబుతున్నారు: మల్లాది విష్ణు
పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బంగారు బాతులా మారిందని వైసీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. 2018 కల్లా పోలవరంను పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. ట్రాన్స్ ట్రాయ్ ను పక్కన పెట్టి ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ కు ఎందుకు పనులను అప్పగించారని అడిగారు. పీ3 (పోలీస్, పోలవరం, పర్చేజ్)తో రానున్న ఎన్నికల్లో గెలవాలంటూ రెండు రోజుల పాటు టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారని విమర్శించారు.
తన పాలనపై నమ్మకం లేకే పీ3 గురించి టీడీపీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారని అన్నారు. నిజంగా ప్రజలంతా మీవైపే ఉంటే... జగన్ ను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు నంద్యాల, కాకినాడ ఎన్నికల ట్రెండ్ ను తీసుకెళ్లాలని చంద్రబాబు చెబుతుండటం హాస్యాస్పదమని చెప్పారు. డబ్బులు పంచి ఈ ఎన్నికల్లో గెలిచారని... ప్రజల్లో మద్దతు లేకున్నా, తమకు బలం ఉందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.