: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఏం చెప్పాలనుకున్నారండీ?: డైరెక్టర్ ను నిలదీసిన సినీ నటి శ్రావ్యారెడ్డి
'అర్జున్ రెడ్డి' సినిమా అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. అలాగే వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. దీంతో ఈ సినిమాను వీహెచ్ మొదలుకుని యాంకర్ అనసూయ వరకు పలువురు విమర్శించారు. వీరి జాబితాలో పూరీ జగన్నాథ్-కల్యాణ్ రామ్ ల ‘ఇజం’ సినిమాలో జర్నలిస్ట్ గా నటించిన శ్రావ్యారెడ్డి కూడా చేరింది. 'అర్జున్ రెడ్డి' సినిమాపై తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, సినిమాలు చూస్తున్నప్పుడు తనకు చాలా తక్కువ సందర్భాలలోనే తలనొప్పి వస్తుందని, అలా తనకు తలనొప్పి తెప్పించిన సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటని తెలిపింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా పేరు 'అర్జున్ దేశ్ ముఖ్' అని ఉండాల్సిందని అభిప్రాయపడింది.
ఈ సినిమాలో అర్జున్ కుటుంబం రెడ్లు కాదని, దేశ్ ముఖ్ లని తెలిపింది. దేశ్ ముఖ్ ల స్థానంలో రెడ్డి అని ఎలా పెడతారని ప్రశ్నించింది. ఈ సినిమా పేరును తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ ఫేస్ కు యుద్ధాలు చేసేంత సీన్ లేదని తెలిపింది. అసలు ఇంతకీ ‘‘ఈ సినిమాతో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండీ డైరెక్టర్ గారు? లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ చేసుకోమనా?’’ అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ప్రశ్నించింది.