: సద్దాంకు పట్టిన గతే చివరకు నీకూ పడుతుంది!: కిమ్ జాంగ్ ఉన్ ను తీవ్రంగా హెచ్చరించిన పుతిన్
అమెరికాతో కయ్యానికి కాలు దువ్వుతున్న ఉత్తరకొరియా తీరుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ ఉద్రిక్తతలపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ దేశమైనా అణ్వాయుధాలు కలిగి ఉండవచ్చని అన్నారు. అయితే వాటిని రెచ్చగొట్టేందుకు వాడకూడదని ఆయన హితవు పలికారు. అమెరికా ప్రధాన భూభాగాలను లక్ష్యం చేసుకుని ఉత్తరకొరియా అణుదాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ... ప్రయోగించిన తరువాత అవి నిర్దేశిత లక్ష్యంపై పడతాయన్న గ్యారెంటీ లేదని అన్నారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారులే తనకు చెప్పారని ఆయన అన్నారు.
కిమ్ జాంగ్ ఉన్ హిస్టీరియాతో బాధపడుతున్నారని ఆయన చెప్పారు. అమెరికాపై అణుదాడి చేస్తే అది తగ్గుతుందని ఆయన అనుకుంటున్నారని పుతిన్ విమర్శించారు. అయితే అది ఈ జన్మలో జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా అమెరికాతో యుద్ధానికి దిగితే ఉత్తరకొరియా మరొక ఇరాక్ అవుతుందని, సద్దాం హుస్సేన్ కు పట్టిన గతే కిమ్ జాంగ్ ఉన్ కు కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. అసలు అమెరికా లాంటి దేశంతో తలపడేందుకు ఉత్తరకొరియా ఎందుకు ఉవ్విళ్లూరుతోందో తనకు అర్థం కావడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.