: కొడుకుతో పాటు కాలేజీకి వెళ్లింది... 54 ఏళ్లకు ఎంబీబీఎస్ పూర్తి చేసింది.. స్ఫూర్తిగా నిలిచిన గుంటూరు మహిళ!
గుంటూరుకు చెందిన లక్ష్మీ సుశీలారాణి 49 ఏళ్ల వయసులో తన కుమారుడితో కలిసి కాలేజీకి వెళ్లింది. కష్టపడి చదివి 54 ఏళ్లకు ఎంబీబీఎస్ పూర్తి చేసి, మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదని మరోసారి రుజువు చేసింది. చిన్నప్పటి నుంచీ తనకు చదువంటే ఆసక్తి అని, ఆర్ఎంపీగా పనిచేసే తన భర్త గుంటుపల్లి సాంబశివరావు ప్రోత్సాహంతోనే తాను డాక్టర్ కాగలిగానని లక్ష్మీ సుశీలా తెలిపారు.
ఇద్దరు కుమారులు నాగచైతన్య, శివకమల్, పెద్దకోడలు చందన ఇలా కుటుంబంలో అందరూ డాక్టర్లే. మరో విషయం ఏంటంటే వీళ్లు నలుగురు మంగళగిరిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీలో వైద్యవిద్య పూర్తిచేశారు. తన క్లాసుకు ఫ్యాకల్టీగా వాళ్ల పెద్దబ్బాయి క్లాస్‌మేట్స్ ఉపాధ్యాయులుగా వచ్చి తనను గుర్తుపట్టి మాట్లాడేవాళ్లని సుశీలారాణి చెప్పారు. ఓ పక్క ఇంటి పనులు చూసుకుంటూనే కష్టపడి చదివి గత ఏప్రిల్‌లో ద్వితీయ శ్రేణి మార్కులతో సుశీలారాణి పాసయ్యారు.
వయసులో పెద్ద అవడంతో తనతో చదువుకునే వాళ్లంతా మొదట్లో పెద్దగా కలవకపోయే వారని, తాను చొరవ తీసుకుని పలకరించడంతో అలవాటు పడిపోయారని ఆమె పేర్కొన్నారు. వారంతా చాలా గౌరవం ఇచ్చేవాళ్లని సుశీలారాణి తెలిపారు. తన మీద నమ్మకంతో ఎంసెట్‌కు ప్రిపేర్ అయ్యేంత సమయం లేకపోవటంతో తన భర్త డొనేషన్ కట్టి మరీ నేరుగా ఎంబీబీఎస్‌లో చేర్పించారని, తన విజయానికి ఆయనే కారణమని సుశీలారాణి సంతోషంగా చెప్పారు.