: నాడు ఎన్టీఆర్ గారు అన్న మాట ఆలోచించేలా చేసింది!: సినీ నటుడు రాజేంద్రప్రసాద్
నవ్వుల రాజు, నటకిరిటీ, సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన దైన శైలిలో హాస్యాన్ని పండించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న నటుడు. రాజేంద్రప్రసాద్ సినీ ప్రయాణం మొదలై నేటికీ నలభై ఏళ్లు అయింది. ఆయన నటించిన తొలిచిత్రం ‘స్నేహం’ 1977 సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ‘మా అన్నయ్య గద్దె నాగేశ్వరరావు అప్పుడు డ్రగ్ కంట్రోలర్ గా పని చేసే వారు. ఆయన పైఅధికారి బి.వి.రమణారావుగారు. బి.వి.పట్టాభిరామ్ కు రమణారావుగారు పెద్దన్నయ్య. మా అన్నయ్య బి.వి. రమణారావుని కలిసి ‘బాపు, రమణలు మీకు బాగా తెలుసట కదండీ, మా తమ్ముడు ఫిలిం ఇనిస్టిట్యూట్ లో గోల్డ్ మెడలిస్ట్. అతనికి సినిమాల్లో ఓ అవకాశం ఉంటే ఇప్పించండి’ అని అడిగారు. అందుకు, ఆయన ‘బాపు, రమణలు మా తమ్ముడు సీతారామ్ కి స్నేహితులు,నాకు కాదు’ అని చెప్పి, ‘వాడికి చెప్పి చూస్తాలే’ అన్నారట. దీంతో, నేను బాపుగారిని కలిశా. అప్పుడు, ‘స్నేహం’ సినిమాలో నటించే అవకాశం నాకు లభించింది. నా సినీ ప్రయాణం మొదలైంది’ అని చెప్పారు.
‘దర్శకుడు వంశీ ‘ప్రేమించు పెళ్లాడు’ చిత్రం ద్వారా నన్ను కథానాయకుడిని చేశాడు. ఆ సినిమా తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు. అయితే, మరో విషయం చెప్పాలి. అసలు, నేను కామెడీ వేషాలు వేయడానికి కారణం ఎన్టీఆర్ గారు. నన్ను మద్రాస్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించింది ఆయనే. నాకు గోల్డ్ మెడల్ వచ్చిన విషయాన్ని, చెప్పడానికి ఓ రోజు ఎన్టీఆర్ గారి వద్దకు వెళితే.. ‘సంతోషం..’ అంటూనే సినీ పరిశ్రమలో ఒకరిలాగైతే మరొకరు అక్కర్లేదు. ‘పౌరాణిక పాత్రలు అనగానే మేమే గుర్తుకొస్తాం. సాంఘిక పాత్రలకి అక్కినేని నాగేశ్వరరావు గారు, డిష్యుం డిష్యుం చేయాలంటే కృష్ణ గారు, రొమాంటిక్ కథలకు శోభన్ బాబు ఉన్నారు. మరి, ఇటువంటి సమయంలో వచ్చిన నువ్వెందుకు పనికొస్తావు?’ అని ఆయన అనడంతో నేను ఆలోచనలో పడ్డా’ అని అన్నారు.
‘కొన్నాళ్లకు ఓ రోజు ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్థులంతా కలిసి అమెరికన్ కాన్స్ లేట్ లో చార్లీ చాప్లిన్ సినిమా ఫెస్టివల్ కి వెళ్లాం. ఆ సినిమా చూశాక నాకు అనిపించింది. ‘కామెడీ‘ అనేది ‘హీరో’ ఎందుకు కాకూడదు? ‘కమెడియన్’ గానే ఎందుకు ఉండాలి?’ ‘చార్లీ చాప్లిన్ కంటే గొప్ప హీరో, నటుడు మరొకరు ఉన్నారా?’..అనే ఆలోచనలు వచ్చాయి. చార్లీ చాప్లినే కామెడీ మార్గంలో నాకు దారి చూపించారు. అయితే, కేవలం, చార్లీ చాప్లిన్ వల్లే నేను ఇంతటి వాడిని అయ్యానా! అంటే ‘కాదు’ అనే చెప్పాలి. ఎందుకంటే, దర్శకులు వంశీ, జంధ్యాల, రేలంగి నరసింహారావు, సింగీతం శ్రీనివాసరావు,ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి... ఇలా ఎంతో మంది దర్శకులు తగిన పాత్రల్ని ఇచ్చారు’ అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.