: ఒంటరితనాన్ని భరించలేక ఎలుకల్ని పెంచుకుంటున్న తల్లీకూతుళ్లు!
ముంబయికి చెందిన ఓ మహిళ, ఆమె కూతురు ఎలుకల్ని పెంచుకుంటున్న సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. శర్వారి ఆచార్య అనే మహిళ భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె తన కుమార్తె శుభనతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. తన భర్త మరణంతో శర్వారి ఆచార్య ప్రతిరోజు కుమిలిపోతోంది. ఆమె కూతురు కూడా ప్రతిరోజు బాధపడిపోతోంది. దీంతో వారిద్దరు కాలక్షేపం కోసం విచిత్రంగా ఎలుకలను పెంచుకోవడం ప్రారంభించారు.
వారు ఉంటోన్న అపార్ట్‌మెంట్‌ను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తమ ఉద్యోగుల కోసం కట్టించింది. మొత్తం అందులో 42 ఫ్లాట్లు ఉన్నాయి. శర్వారి భర్త ఎస్‌బీఐలోనే పనిచేసేవారు కాబట్టి అందులో వారికి ఒక ప్లాట్ దక్కింది. తమ అపార్ట్‌మెంట్‌లో తల్లీకూతుళ్లు మొత్తం 100 ఎలుకలను తెచ్చుకుని పెంచుకుంటున్నారు. ఆ ఎలుకలు అపార్ట్‌మెంట్‌లోని మిగతా ఫ్లాట్లలోకి వెళ్లి అలజడి రేపాయి. ఈ విషయంలో ఆ తల్లీకూతుళ్లను హెచ్చరించినప్పటికీ వారు వినిపించుకోలేదు.
దీంతో ఆపార్ట్‌మెంట్ వాసులు బీఎంసీకి ఫిర్యాదు చేశారు. తాము ఒంటరితనం భరించలేకే ఈ ఎలుకల్ని పెంచుకుంటున్నామని సదరు తల్లీకూతుళ్లు బీఎంసీ అధికారులకు చెప్పారు. అయితే, బీఎంసీ అధికారులు వారికి నచ్చజెప్పడంతో ఎలుకల్ని పట్టుకుని, బయట వదిలేయడానికి వారు అంగీకరించారు. ఇప్పటివరకు బీఎంసీ సిబ్బంది 60 ఎలుకల్ని పట్టుకుంది.