: ఆయన మాటల్లో అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం!: పవన్ కల్యాణ్ పై మహేశ్ కత్తి తీవ్ర విమర్శలు
‘రిజర్వేషన్లు లేని సమాజం కావాలి.. కాపు రిజర్వేషన్లపై సర్కారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సినీ విశ్లేషకుడు మహేశ్ కత్తి తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్లో అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం అక్షరం అక్షరంలో కనిపిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తాడు.
మహేశ్ కత్తి ఈ అంశంపై తన ఫేస్బుక్ ఖాతాలో స్పందిస్తూ... ‘రాజ్యాంగం మీద అవగాహన, రాజకీయ పరిణతి చాలా దూరం. కనీసం కామన్ సెన్స్ లేని ఇలాంటి స్టేట్మెంట్స్ పవన్ కల్యాణ్ తెలియనితనాన్ని సూచిస్తున్నాయి. తరతరాల రిజర్వేషన్ల అమలులోని అవకతవకలతో పోరాడుతూ, ఇప్పటికీ వివక్ష అనుభవిస్తున్న కోట్ల మంది దళితుల గురించి మాట్లాడని ఇతడు.. దళిత సమస్యలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం ట్వీట్ చెయ్యని ఇతను.. ఇప్పుడు రిజర్వేషన్ల గురించి, అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాడు’ అంటూ విమర్శించాడు.
‘కనీసం 1% కూడా లేని క్రిమిలేయర్ పెద్ద సమస్య అన్నట్టు పోజులిస్తున్నాడు. అవగాహనా రాహిత్యం, మూర్ఖత్వం మాట్లాడిన అక్షరం అక్షరంలో కనిపిస్తున్నాయి. ఇప్పుడే కదా, కాపులు తమ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. ముద్రగడ గురించి మాట్లాడమంటే, సెన్సిటివ్ విషయాలపై స్పందించను అనే ఈ పలాయనవాది, దళితుల రిజర్వేషన్ల నిర్మూలనే ధ్యేయంగా ఉన్నట్టు ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూస్తే, ఇతని దళిత వ్యతిరేకత సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇదే జనసేన పంథా అయితే, ఇదే ఇతగాడి "స్థాయి" అయితే, మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం' అని మహేశ్ కత్తి పేర్కొన్నాడు.
మరోవైపు సోషల్ మీడియాలో పవన్ వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. రిజర్వేషన్లు లేని సమాజం కావాలంటూనే.. పవన్ కల్యాణ్ మళ్లీ కాపులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అనడం ఏంటని సోషల్ మీడియాలో పవన్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.