: రూ. 16,347.50 కోట్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను చేజిక్కించుకున్న స్టార్ ఇండియా
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసార హక్కుల కోసం 14 మీడియా సంస్థలు పోటీపడగా, వారిలో ఎక్కువగా రూ. 16,347.50 కోట్లు బిడ్ వేసి స్టార్ ఇండియా ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. దీంతో 2018 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఐపీఎల్‌కు సంబంధించిన మీడియా, డిజిటల్ కార్యక్రమాలను స్టార్ ఇండియా ప్రసారం చేసుకునే సౌకర్యం కలిగింది. భారత్‌లో డిజిటల్, ఇంటర్నెట్ మాధ్యమాల ద్వారా ప్రసారం కోసం ఎక్కువ బిడ్ వేసిన సంస్థలుగా రిలయన్స్ జియో, టైమ్స్ ఇంటర్నెట్, ఎయిర్‌టెల్, ఫేస్‌బుక్ నిలిచాయి. టీవీ ప్రసార హక్కుల కోసం సోనీ, స్టార్ ఇండియాలు అధికంగా బిడ్ చేశాయి. బిడ్లు వేసిన 14 కంపెనీల్లో బామ్‌టెక్, బెయిన్ స్పోర్ట్స్ సంస్థలను కొన్ని సంస్థాగత కారణాల వల్ల ఐపీఎల్ ప్రసారానికి అనర్హులుగా ప్రకటించారు.
గతంలో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులను సోనీ దక్కించుకోగా, స్టార్ ఇండియా డిజిటల్ హక్కులను పొందిన సంగతి తెలిసిందే. 2008లో జరిగిన వేలంలో రూ. 8,200 కోట్లతో సోనీ పదేళ్ల కాలానికి ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఐపీఎల్ బాగా క్రేజ్ సంపాదించడంతో భారత భూభాగంలో జరిగిన మ్యాచ్‌లు ప్రసారం చేసుకునేందుకు 2012లో స్టార్ గ్రూప్ రూ. 3,851 కోట్లను చెల్లించింది. ఈ ఒప్పందం 2018 వరకు అమల్లో ఉండగానే మళ్లీ ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం స్టార్ గ్రూప్ వేలంలో పాల్గొని, దక్కించుకోవడం విశేషం.