: అమెరికాలో భారతీయ విద్యార్థిని షాలిని ప్రాణం తీసిన హార్వీ తుపాను!
అమెరికాలోని టెక్సాస్ ను హార్వీ తుపాను వణికించిన సంగతి తెలిసిందే. ఈ తుపానును అమెరికా ప్రభుత్వం పెను ఉపద్రవంగా అభివర్ణించింది. ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న హార్వీ తుపాను... అక్కడి యూనివర్శిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థిని షాలిని సింగ్ (25) ప్రాణాలను కూడా బలిగొంది. వివరాల్లోకి వెళ్తే, తుపాను సమయంలో వరదలో కొట్టుకుపోతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్ లను కొందరు కాపాడి ఆసుపత్రికి తరలించారు.
వారికి అత్యవసర చికిత్స అందించినప్పటికీ, ఇద్దరూ మరణించారు. ఢిల్లీకి చెందిన షాలిని గత నెలలోనే అమెరికాకు వెళ్లడం గమనార్హం. డెంటల్ సర్జరీలో డిగ్రీ చేసిన ఆమె... అక్కడి యూనివర్శిటీలో పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. మొత్తం 200 మంది భారతీయ విద్యార్థులు వరదలలో చిక్కుకున్నారు. అయితే, మిగిలిన వారు మాత్రం ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.