: అభిమానుల ఆగ్రహానికి గురైన శార్దూల్ 'నెంబర్ 10' జెర్సీ వెనక కథ ఇదీ!
టీమిండియాలో చోటు సంపాదించి బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే విమర్శల పాలైన శార్దూల్ ఠాకూర్ తనపై వస్తున్న విమర్శలకు పుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. జట్టులోకి 218వ ఆటగాడిగా వచ్చి చేరిన ఠాకూర్ శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో నెంబర్ 10 జెర్సీ ధరించి బరిలోకి దిగాడు. విమర్శలకు ఇది కారణమైంది. ఆ నెంబరు జెర్సీ క్రికెట్ లెజెండ్ సచిన్‌ది మాత్రమేనని, దానిని ధరించే అర్హత మరెవరికీ లేదంటూ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మ్యాచ్‌లో శార్దూల్ 7 ఓవర్లు వేసి 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ నేల కూల్చాడు. తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచినందుకు పలువురు ప్రశంసించినా జెర్సీ మాత్రం అతడిని విమర్శలకు గురిచేసింది.
తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన ఠాకూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెంబర్ 10 జెర్సీ ధరించడం వెనక ఉన్న కథను వివరించాడు. న్యూమరాలజీ ప్రకారమే దీనిని ధరించానని వివరించాడు. తాను అక్టోబరు 16, 1991లో జన్మించానని పేర్కొన్నాడు. ఈ లెక్కన [(1+6)+(1+0)+(1+9+9+1) = 7+1+(2+0) = 10] 10.. అని వివరించాడు. అందుకనే తాను నెంబర్ 10 జెర్సీని ధరిస్తున్నట్టు చెప్పి వివాదానికి చెక్ పట్టే ప్రయత్నం చేశాడు. మరి సచిన్ అభిమానులు ఆయన చెప్పిన సమాధానానికి శాంతిస్తారో .. లేదో వేచి చూడాల్సిందే.