: నిర్మలాసీతారామన్ ను పరకాల ప్రభాకర్ ఎప్పుడు? ఎక్కడ? కలిశారు?


కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ భార్యా భర్తలన్న సంగతి తెలిసిందే. తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పరకాల ప్రభాకర్ ఎక్కడ? ఎప్పుడు? ఎలా? కలిసి ఉంటారన్న ఆసక్తి అందర్లోనూ ఉంది. నిర్మలా సీతారామన్ 18 ఆగస్టు 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించారు. తండ్రి నారాయణన్‌ సీతారామ్‌ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి పుస్తకపఠనం నిర్మలకు అబ్బాయి. మధురైలో స్కూలింగ్ పూర్తి చేశారు. తరువాత తిరుచిరాపల్లిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. పీజీ కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) లో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశారు. అక్కడే ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఆ తరువాత ఆమె అక్కడే జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారీఫ్స్‌ అండ్‌ ట్రేడ్‌ అంశంలో ఎంఫిల్‌, ఆ తరవాత పీహెచ్డీ (ఇండో-యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌  అంశంలో) పట్టాలు పొందారు. అనంతరం వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. ప్రభాకర్‌ బీజేపీలో చేరి 2000లో ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. నిర్మలా సీతారామన్‌ 2006లో అధికారికంగా బీజేపీలో చేరారు. నితిన్‌ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తరువాత మోదీ కేబినెట్‌ లో సహాయ మంత్రిగా చేరిన ఆమె, ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News