: ‘లోటస్‌పాండ్’కు త్వరలో టూలెట్ బోర్డు ఖాయం: మంత్రి ఆనందబాబు
వైసీపీ నేతలు సేఫ్ జోన్ చూసుకుంటున్నారని, లోటస్‌పాండ్‌కు త్వరలో టూలెట్ బోర్డు పెట్టడం ఖాయమని ఏపీ మంత్రి ఆనందబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి పట్టిన అతిపెద్ద శని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని, వారానికోసారి కోర్టుకెళ్లే జగన్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారని విమర్శించారు. సీఎం పదవిపై ఆశ తప్ప.. ప్రజా సమస్యలపై జగన్ కు ధ్యాస లేదని, నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో కూడా ఆయనలో మార్పురాలేదని అన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ పురపాలక ఎన్నికల్లో ఓటమిని భరించలేని జగన్, ప్రజలపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ నిరోధకుడుగా మారారని ఆరోపించారు. రాజధాని, భోగాపురం విమానాశ్రయం నిర్మాణాలకు భూములు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్, ప్రజలకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.