: మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఘోర తప్పిదం.. అమర సైనికుడి భార్యకు బదులు మరో మహిళను సత్కరించిన వైనం!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఘోర తప్పిదం చేశారు. యశ్ భారతి అవార్డుల ప్రదానం సందర్భంగా అమర సైనికుడి భార్యను బదులు మరో మహిళను సత్కరించి విమర్శల పాలయ్యారు. ఆగస్టు 30న నత్తుపూర్ గ్రామంలో వీర సైనికుడు రామ్ సముజ్ యాదవ్ విగ్రహాన్ని అఖిలేశ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి 38 మంది వీరమరణం పొందిన సైనికుల భార్యలను ఆహ్వానించగా 28 మంది హాజరయ్యారు. వారందరికీ మెమొంటోలు బహూకరించి ఘనంగా సత్కరించారు.
అయితే అఖిలేశ్ సత్కరించిన వారిలో వీర సైనికుడు అబ్దుల్ హమీద్ భార్య రసూలన్ బీబీ స్థానంలో మరో మహిళ వచ్చి చేరింది. ఆమెతో రెండు నిమిషాలు మాట్లాడిన అఖిలేశ్ ఆమెను కూడా సత్కరించారు. అయితే కార్యక్రమం ముగిశాక గానీ చేసిన తప్పిదం తెలియరాలేదు. అఖిలేశ్ యాదవ్ తన నానమ్మను సత్కరించినట్టు వచ్చిన వార్తను చదివిన అబ్దుల్ హమీద్ మనవడు ఆశ్చర్యపోయాడు. తన నాన్నమ్మ ఇంట్లో ఉండగానే అఖిలేశ్ ఎలా సత్కరించారో తెలియక అవాక్కయ్యాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ విషయమై రసూలన్ బీబీ స్పందిస్తూ తమకు అఖిలేశ్ నుంచి ఎటువంటి ఆహ్వానం అందలేదని తెలిపారు. అయితే ఆమె స్థానంలో యశ్ భారతి అవార్డును అందుకున్నది ఎవరని ఆరా తీయగా ఆమె 1962 ఇండో-చైనా యుద్ధంలో అమరుడైన భగవతి సింగ్ భార్య లలిత అని తేలింది. కాగా, సెప్టెంబరు 10, 1965లో అబ్దుల్ హమీద్ చీమా గ్రామంలో మూడు పాకిస్థానీ ట్యాంకులను నేలమట్టం చేశాడు. నాలుగో దానిని ధ్వంసం చేస్తున్న సమయంలో అమరుడయ్యాడు. హమీద్ మరణానంతరం వారంలోనే ప్రభుత్వం ఆయనను ‘పరమ వీర చక్ర’తో గౌరవించింది. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా రసూలన్ బీబీ ఈ అవార్డును అందుకున్నారు.