: 300వ వన్డేలో ధోనీకి అపురూప కానుక.. ప్లాటినం బ్యాట్‌ను బహూకరించిన బీసీసీఐ
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం కొలంబోలో శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డే టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి చారిత్రాత్మక వన్డే. తన కెరీర్‌లో ఇది 300వ వన్డే. ధోనీ రికార్డు వన్డేకు గుర్తుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ధోనీకి ప్లాటినం బ్యాట్‌ను బహూకరించింది. కెప్టెన్ కోహ్లీ చేతుల మీదుగా ధోనీ ఈ బ్యాట్‌ను అందుకుని మురిసిపోయాడు.
బహుమతి ప్రదానానికి ముందు కోహ్లీ మాట్లాడుతూ.. ప్రస్తుత జట్టులోని 90 శాతం మంది ఆటగాళ్లు మీ సారథ్యంలోనే ఆడామని గుర్తు చేశాడు. ‘‘మీరెప్పుడూ మా కెప్టెనే’’ అని పేర్కొన్నాడు. కాగా, చారిత్రక మూడు వందల వన్డేలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ మునుపటి ఆటతీరును ప్రదర్శించాడు. ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 49 పరుగులు చేశాడు. ఈ వన్డేలో భారత్ 168 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.