: ప్రజలు ‘ఛీ కొట్టినా’ కాంగ్రెస్ నాయకులు మారడం లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి
ప్రజలు ‘ఛీ కొట్టినా’ కాంగ్రెస్ నాయకులు మారడం లేదంటూ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు రావడంపై కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అసలు, బియ్యం ఎలా వస్తాయో కూడా తెలియని టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రైతుల గురించి మాట్లాడితే జనం నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. భూముల సర్వేను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. ఒకవేళ, ప్రభుత్వం చేపట్టే భూ సర్వేను కాంగ్రెస్ అడ్డుకుంటే, వాళ్లపై ప్రజలే తిరగబడతారని అన్నారు. కాగా, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిన రైతుల ఆత్మహత్యలకు స్పందించని కేసీఆర్ కు అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని ఇటీవల వ్యాఖ్యానించారు.