: వణికిస్తోన్న బ్లూ వేల్ గేమ్... వింత ప్రవర్తనతో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
బ్లూ వేల్ ఆన్‌లైన్ గేమ్ బారిన పడుతున్న భారత యువత సంఖ్య పెరిగిపోతోంది. ఈ ప్రమాదకర గేమ్ బారిన పడి విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మధురైలో విగ్నేష్ (19) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే అసోంలో ఇటువంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. అసోంలోని గౌహతిలో పదవ తరగతి విద్యార్థి ఒకరు ఈ గేమ్ బారినపడి వింతగా ప్రవర్తించాడు. అతడు తన చేతిపై పెట్టుకున్న బ్లూవేల్ మార్క్ కనిపించింది.
ఆ బాలుడు ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తుండడంతో గమనించిన అతడి తల్లిదండ్రులు గువహతి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ ఆసుపత్రి సుపరింటెండెంట్ ఈ బాలుడి మానసిక పరిస్థితి గురించి మాట్లాడుతూ... ఆ బాలుడు ఆసుపత్రి నుంచి పారిపోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడని అన్నారు. ప్రస్తుతం తమ ఆసుపత్రి సైకియాట్రిస్టులు ఆ బాలుడికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.