: అమెరికాకు కొత్త కష్టం... వంట గ్యాస్ లభించక వెలగని పొయ్యి!
అమెరికన్లకు కొత్త కష్టం వచ్చి పడింది. హ్యూస్టన్ ప్రాంతాన్ని భారీ వర్షాలు ఆపై వరదలు ముంచెత్తగా, దేశ వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. అమెరికన్ ప్రజలకు అందించే వంట గ్యాస్ లో మూడో వంతు హ్యూస్టన్ నుంచే అందుతుంది. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా అక్కడ ఉత్పత్తి, సరఫరా పూర్తిగా నిలిచిపోయాయి. నిల్వవున్న గ్యాస్ పూర్తయిపోగా, హ్యూస్టన్ పరిసరాల్లో ఇప్పటికే వాహనాలకు, ఇళ్లకు గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ఈ ప్రభావం వాషింగ్టన్, న్యూయార్క్, కాలిఫోర్నియా తదితర నగరాలపైనా పడినట్టు సమాచారం. చాలా చోట్ల వంట గ్యాస్ కొరత ఏర్పడగా, పరిస్థితి చక్కబడేందుకు మరో వారం రోజుల వరకూ పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలు తగ్గుముఖం పడితే, హ్యూస్టన్ నుంచి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరో మూడు రోజులు పడుతుందని అంటున్నారు. గ్యాస్ లభించని ప్రాంతాల్లోని ప్రజలు, ఫాస్ట్ ఫుడ్స్ కోసం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది.