: నెమ్మదిగా నడిచేవారికి క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదం అధికం... కొత్త అధ్యయనం
మీకు నెమ్మదిగా నడిచే అలవాటుందా? అయితే, ఆ అలవాటును వదులుకొని కాస్త వేగంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. యూకే బయో బ్యాంక్ సుమారు పదకొండేళ్ల పాటు సాగించిన ఓ అధ్యయనం వెల్లడించిన వివరాల ప్రకారం, నెమ్మదిగా నడిచేవారికి గుండె సంబంధ వ్యాధులతో మరణించే ప్రమాదం అధికమని వెల్లడైంది. 2006 నుంచి 2010 మధ్య ఇంగ్లండ్ లోని మధ్య వయసులో ఉన్న వారి వివరాలను విశ్లేషించి, సుమారు 4.20 లక్షల మందిపై ఈ పరిశోధన చేశారు.
ఆ సమయంలో వీరికి ఎటువంటి క్యాన్సర్, గుండె జబ్బులు లేవు. ఇక వీరిని ఆపై ఆరున్నరేళ్ల పాటు పరిశీలించారు. వీరిలో 1,654 మంది గుండె సంబంధ వ్యాధులతో మరణించగా, 4,850 మంది క్యాన్సర్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఆపై ఫలితాలను విశ్లేషించగా, వీరిలో అత్యధికులు స్థిరంగా, నెమ్మదిగా నడుస్తూ ఉన్నారని అర్థమైందని లీసెస్టర్ యూనివర్శిటీ రీసెర్చ్ ఎక్స్ పర్ట్ టామ్ యేట్స్ వెల్లడించారు. తమ అధ్యయనం ఫలితాల ప్రకారం, నిదానంగా నడిస్తే గుండెజబ్బుల ప్రమాదం రెండు రెట్లు అధికమన్న నిర్ణయానికి వచ్చామని ఆయన తెలిపారు.