: ఉదయం 3.30 గంటలకే నిద్ర లేస్తా: సినీ నటుడు బాలకృష్ణ
రోజూ ఉదయం 3.30 గంటలకే తాను నిద్ర లేస్తానని, ప్రతిక్షణం క్రమశిక్షణతో వ్యవహరించడం మర్చిపోనని... తన తండ్రి ఎన్టీఆర్ నుంచి తనకు వారసత్వంగా వచ్చింది, నిలబెట్టుకుందీ అదేనని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందించిన ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ఓ బ్రాండ్ ఉందని, ఆయన కథలు, పాత్రలు ప్రేక్షకుడికి బాగా నచ్చుతాయని చెప్పారు.
తనతో ఎలాంటి సినిమా చేస్తే బావుంటుంది అనే విషయాన్ని దర్శకుడికే వదిలేస్తానని ఈ సందర్భంగా బాలయ్య చెప్పారు. పని లేకపోతే తాను ఉండలేనని, తన స్వభావానికి తగ్గట్టుగానే తనకు అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా తాను చేస్తున్న పనులన్నీ సంతృప్తిని ఇస్తున్నాయని అన్నారు.