: పవన్ కల్యాణ్ పై పోరాటం.. జాతీయ మీడియాకు ఎక్కిన మహేశ్ కత్తి!
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆవేదన చెందుతున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ జాతీయ మీడియాలోనూ దర్శనమిచ్చాడు. పీకే ఫ్యాన్స్ తమ మూర్ఖత్వంతో తనను దేశ వ్యాప్తంగా పాప్యులర్ చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. ఓ జాతీయ ఛానెల్లో తన గురించి ఇచ్చిన ఓ న్యూస్‌కి సంబంధించిన వీడియోను ఆయన తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తనను ఎలా వేధిస్తున్నారన్న విషయాన్ని ఆయన సాక్ష్యాలతో సహా చూపించాడు. పవన్ కల్యాణ్ అభిమానులు నిమిషానికి 10 ఫోన్ కాల్స్ చేస్తున్నారని, రోజంతా ఇదే తీరు అని, దీంతో తన మొబైల్‌ను కూడా తాను ఉపయోగించుకోలేకపోతున్నానని అన్నాడు.
కొందరు తనను ఈ గొడవ ఇక అపేయాలని చెబుతున్నారని మహేశ్ కత్తి మరో ట్వీట్లో రాసుకొచ్చాడు. ‘నేను మొదలెట్టని దానిని నేను ఎలా ఆపుతాను? కాల్స్ వస్తున్నంత వరకూ నేను ఈ సమస్య గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది పబ్లిసిటీ అనుకుంటే మీ ఇష్టం. ఎందుకంటే జరుగుతున్న నష్టం ఎవరికో కాదు, నాకు. ఆ నొప్పి నాది. నాకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు, పవన్ ఫ్యాన్స్ ని ఆగమనో, పవన్ కల్యాణ్ ని ఆపమనో ఎందుకు చెప్పరు? మీ మీద కూడా దాడి చేస్తారని భయమా? అయితే మీ భద్ర లోకాలలో మీరు ఉండండి. నా పోరాటం నేను చేసుకుంటాను. చిరాకు అనిపిస్తే నన్ను మీ సోషల్ మీడియా ఖాతా నుంచి దయచేసి బ్లాక్ చేసేయ్యండి’ అని ఆయన పేర్కొన్నాడు.