: ఆరోగ్యం బాగాలేదని మొత్తుకున్నా వినని భర్త... కటకటాల్లోకి నెట్టించిన భార్య!
గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్న భార్యాభర్తలు, పెద్దల జోక్యంతో కలసి కాపురం చేసుకునేందుకు అంగీకరించిన వేళ, తనతో శృంగారానికి నిరాకరిస్తోందని భార్యను భర్త చావగొట్టగా, భర్తను కటకటాల్లోకి నెట్టించిందో మహిళ. హైదరాబాద్ శివార్లలోని ఘట్ కేసర్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, రవికుమార్ (35) ప్రభుత్వ ఉద్యోగి. అతను తన భార్య నుంచి విడిపోయి మూడేళ్లుగా వేరుగా ఉంటున్నాడు. ఇటీవల కుటుంబ పెద్దలు సమస్యలను పరిష్కరించి ఇద్దరినీ ఒకటి చేశారు.
ఆపై గత శనివారం నాడు రవికుమార్, తన భార్యతో శృంగారానికి ప్రయత్నించగా, ఆమె తనకు ఆరోగ్యం బాగాలేదని వారించింది. బయటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, తనను నిరాకరిస్తుందన్న అనుమానంతో రవికుమార్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ మరుసటి రోజు ఆరోగ్యం ఏం బాగాలేదో పరీక్షలు చేయిస్తానంటూ మెడికల్ టెస్టులకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె అనారోగ్యంతో ఉందన్న రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆ రిపోర్టులు తీసుకున్న ఆమె, తన భర్త శారీరకంగా హింసిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవికుమార్ ను అరెస్ట్ చేశారు. రవిపై ఐపీసీ సెక్షన్ 498 (ఏ)కింద కేసు నమోదు చేసినట్టు ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ బీ ప్రకాశ్ వెల్లడించారు.