: ‘జయలలిత కూతుర్ని నేనే.. శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నం నేను’.. తమిళనాట తాజా సంచలనం!
దివంగత జయలలిత కుమార్తెను నేనే. నటుడు శోభన్‌బాబు, జయలలిత ప్రేమకు తీపి గురుతు నేను. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోండి’’ అంటూ అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. తన కన్నతల్లిది సహజ మరణం కాదని, నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌లకు ఆమె రాసిన లేఖలు తాజాగా వెలుగుచూశాయి.
‘‘మాజీ ముఖ్యమంత్రి జయలలిత నా కన్నతల్లి. తను తల్లిదండ్రులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సమయంలో శోభన్‌బాబు అండతో కోలుకుంది. అలా వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమాప్యాయలతకు గుర్తే నేను. అయితే వివిధ కారణాల వల్ల వివాహం చేసుకోలేదు. దీంతో నన్ను జయ సోదరి శైలజ, భర్త సారథిలకు అప్పగించారు. అయితే నేను ఎవరన్న విషయం ఎవరికీ చెప్పొద్దని వారితో ఒట్టు వేయించుకున్నారు. 1996లో శైలజ సూచన మేరకు జయను కలిస్తే వివరాలు తెలుకుని నన్ను ఒక్కసారిగా హత్తుకున్నారు. అయితే ఆమె నా తల్లి అన్న విషయాన్ని ఆమె ఎప్పుడూ చెప్పలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు.
జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు మీడియా ముందుకొచ్చి తామే జయ వారసులమని చెప్పడం తనను బాధించిందన్నారు. తన తల్లి మరణం వెనక శశికళ, నటరాజన్‌ల పాత్ర ఉందని, ఈ విషయంలో నిజాల నిగ్గు తేల్చేందుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అమృత లేఖ తమిళనాడులో పెను సంచలనానికి కారణమైంది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు అమృత గురించే చర్చించుకుంటున్నారు.