: సైనా ఓటమికి టీవీ షెడ్యూలింగే కారణం.. ఆరోపించిన కోచ్ విమల్ కుమార్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకోవడంపై ఆమె కోచ్ విమల్ కుమార్ వివరణ ఇచ్చారు. క్వార్టర్ ఫైనల్- సెమీస్ మధ్య సమయం సరిపోలేదని, క్వార్టర్ ఫైనల్ ముగిసిన వెంటనే సెమీస్లో తలపడడం వల్ల ఆట తీరుపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. ఓటమికి ముమ్మాటికి ‘చెత్త’ షెడ్యూలింగే కారణమని ఆరోపించారు. షెడ్యూల్ను టీవీ ప్రసారాలు ప్రభావితం చేసేలా ఉండకూడదని అన్నారు.
ఇటువంటి మెగా ఈవెంట్లలో కచ్చితమైన షెడ్యూల్ పాటించాలని పేర్కొన్నారు. అర్ధరాత్రి క్వార్టర్స్ ఆడిన సైనా తెల్లారి మళ్లీ సెమీస్లో ఆడడం వల్లే ఇలా జరిగిందని, మ్యాచ్కు సన్నద్ధం కావడానికి సమయం సరిపోలేదని విమల్ వివరించారు. షెడ్యూలింగ్కి పూర్తి బాధ్యత టెక్నికల్ అధికారులే వహించాలన్నారు. సైనాకు ఇలా జరగడం దురదృష్టకరమని విమల్ ఆవేదన వ్యక్తం చేశారు.