: శిల్పా ఓటమి వెనక ఉన్నది జగనేనా?... విశ్లేషకులు చెబుతున్నది ఇదే!


2019 ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన నంద్యాల సీటను టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ-వైసీపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్టు సాగిన పోరులో ఓటర్లు చివరికి టీడీపీవైపే మొగ్గారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ ప్రచారంలో పాల్గొన్నారు. ఏకంగా 13 రోజులు నంద్యాలలోనే మకాం వేసి వాడవాడలా తిరిగారు. అయితే ఆయన ప్రచారం ఓటర్లపై ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది.

వైసీపీ ఓటమిపై రాజకీయ విశ్లేషకులు అందరూ ఒకేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఓటమికి జగనే కారణమనేది వారి అభిప్రాయం. అభ్యర్థిని డమ్మీ చేసి అంతా తానై ప్రచారంలో పాల్గొనడం, ‘మీరు వేస్తున్న ఓటు ఎమ్మెల్యేను ఎన్నుకునేందుకు కాదు.. జగన్‌కు’ అంటూ ప్రచారంలో పదేపదే చెప్పడమే జగన్ కొంప ముంచిందంటున్నారు. 13 రోజులపాటు శిల్పాను ఆయన వెంటనే ఉంచుకున్నారు తప్పితే శిల్పాకు స్వేచ్ఛనివ్వకపోవడం, ఆయనకు కూడా ప్రచారం చేసే అవకాశం ఇవ్వకపోవడం కూడా మరో కారణమంటున్నారు.

'ఇది రాబోయే కురుక్షేత్రానికి నాంది' అంటూ జగన్ పదేపదే 2019 ఎన్నికలను గుర్తు చేశారు. తన ప్రచారంతో నంద్యాల అభ్యర్థిని పరోక్షంగా తానే అన్న భ్రమను ఓటర్లకు కల్పించారని చెబుతున్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడినన్న విషయాన్ని మరిచి వార్డు కౌన్సిలర్ స్థాయిలో నిర్వహించిన ప్రచారమే నంద్యాల ఓటమికి కాణమని విశ్లేషిస్తున్నారు. జగన్ రెండు రోజులే ప్రచారం చేసి మిగతా రోజుల్లో శిల్పాకు అవకాశం ఇచ్చి ఉంటే ఫలితాలు మరోలా ఉండే అవకాశం ఉండేదంటున్నారు. ఈ ఓటమి శిల్పాది కాదని, జగన్‌దేనని అంతిమంగా తేల్చి చెబుతున్నారు.

  • Loading...

More Telugu News