: సినిమా హాల్ లో మొబైల్ పోయిందని... ప్రేక్షకులపై కాల్పులు జరిపిన వ్యక్తి.. ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు
ఓ గుర్తు తెలియని వ్యక్తి సినిమా థియేటర్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఘటన దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్ నగరంలో చోటు చేసుకుంది. హిల్బ్రో థియేటర్లో ఆ వ్యక్తి సినిమా చూడడానికి వచ్చాడు. అయితే, తన మొబైల్ ఫోన్‌ను అక్కడ పోగొట్టుకున్నాడు. దీంతో ఆయన థియేటర్ మేనేజర్ దగ్గరకు వెళ్లాడు. తన మొబైల్ ఫోన్ పోయిందని ప్రేక్షకులకు చెప్పాలని కోరాడు. అంతలోనే అక్కడ ఉన్న మైక్ తీసుకొని తానే ఆ విషయాన్ని ప్రకటించాడు.
తన మొబైల్ పోయిందని, ఎవరికి దొరికిందో వారు తనకు మర్యాదగా తెచ్చివ్వాలని బెదిరించాడు. అయితే, వారి నుంచి స్పందన రాకపోవడంతో తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.