: 'ఆయన డేరా బాబా అయితే ఈయన జగన్ బాబా' అని అందుకే అన్నాను: చంద్రబాబు
మంచి సంస్థను పెట్టుకుని, అంతమంది భక్తులను పెట్టుకుని డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ బాబా తన శక్తిసామర్థ్యాలను దుర్వినియోగం చేశాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... అమ్మాయిల పట్ల ఆ బాబా ప్రవర్తించే తీరు ఎలాంటిదో ఈ రోజు అందరికీ తెలిసిందని చెప్పారు. సాధువులు అనేవారు ఇలా ఉండరని చెప్పారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక వ్యక్తి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించవచ్చో చూపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
జగన్ అసభ్య ప్రవర్తన, అసెంబ్లీని జరగకుండా చేసే తీరు, ఆయన చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలు ఎలాంటివో ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు అన్నారు. అందుకే తాను నిన్న ‘ఆయన డేరా బాబా అయితే ఈయన జగన్ బాబా’ అని అన్నానని వ్యాఖ్యానించారు. ‘జాగ్రత్తగా ఉండు సీఎంతో మాట్లాడుతున్నావ్’ అంటూ జగన్ కొన్ని నెలల ముందు అధికారులను బెదిరించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఎక్కడికెళ్లినా జగన్ ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నారని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, అసెంబ్లీలోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.