: మాజీ అధ్యక్షుడి భార్యకు, అమెరికన్ గాయకుడికి పెళ్లి అంటూ పుకార్లు.... జరిమానా విధించిన దక్షిణ కొరియా కోర్టు
దక్షిణ కొరియా దివంగత మాజీ అధ్యక్షుడు కిమ్ దే జంగ్ సతీమణి 92 ఏళ్ల లీ హీ హో, 52 ఏళ్ల అమెరికన్ ర్యాపర్ డాక్టర్ డ్రేను పెళ్లి చేసుకోబోతున్నారని ఆన్లైన్లో పుకార్లు సృష్టించిన వ్యక్తికి సియోల్ కోర్టు జరిమానా విధించింది. 73 ఏళ్ల వ్యక్తి సృష్టించిన పుకార్లు ఆన్లైన్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ పుకార్ల కారణంగా మాజీ అధ్యక్షుడి పరువు మంటగలిసేలా ఉందని ఆ వ్యక్తిపై 5 మిలియన్ వాన్ల పరువు నష్టం దావా వేసింది. ఈ పుకార్లలో ఎలాంటి నిజం లేదని, ఆన్లైన్లో వాటిని ఎవరూ షేర్ చేయవద్దని, వాటి లింక్‌లను కూడా డిలీట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఈ వార్తపై కొంతమంది నెటిజన్లు మాత్రం ఇప్పటికే ఆహ్వాన పత్రిక, పెళ్లి పెద్దలను కూడా నిర్ణయించేసి, జోకులను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.