: గుర్మీత్ కు శిక్ష ఎంత?... సిర్సా, పంచకులలో కనిపిస్తే కాల్చివేత్త ఉత్తర్వులు!
అత్యాచారం కేసులో దోషిగా నిరూపితుడైన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు నేటి మధ్యాహ్నం తరువాత పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు శిక్షను ఖరారు చేయనుండగా, ఆపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా భారీ ఎత్తున పాలామిలటరీ, బీఎస్ఎఫ్ సహా పలు కేంద్ర బలగాలను కేంద్రం మోహరించింది. ఆయనకు కనీసం ఏడు సంవత్సరాల నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో సీబీఐ న్యాయమూర్తి జగదీప్ సింగ్ ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని వుంది.
తీర్పును ఇచ్చేందుకు రోహ్ తక్ లోని సోనారియా జైల్లోనే ఏర్పాట్లు చేయగా, జగదీప్, ఇప్పటికే పంచకుల నుంచి సోనారియాకు బయలుదేరారు. ఇక సిర్సాతో పాటు పంచకుల ప్రాంతంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలులో ఉన్నాయని, బహిరంగ ప్రదేశంలో ఎవరు కనిపించినా, వారిని కాల్చి చంపే అధికారాలు తమకు ఉన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎటువంటి నిరసనలకూ దిగరాదని హెచ్చరించారు.