: స్వైన్ ఫ్లూతో మృతి చెందిన రాజస్థాన్ ఎమ్మెల్యే
రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిర్తీ కుమారి స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్ ఘర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న కిర్తీ కుమారిని జైపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నిన్న ఆమె కుటుంబసభ్యులు తరలించారు. అర్ధరాత్రి తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో... ఆమెను వెంటిలేటర్ పై ఉంచారు. అయినప్పటికీ ఆమెను కాపాడలేకపోయారు. ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఆమె 83 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.