: బార్‌కోడ్‌తో బీఎంపీ2 యుద్ధ వాహనాలు... సైన్యానికి అందజేసిన రక్షణ మంత్రి
దేశ బలగాలకు కావాల్సిన సామర్థ్యాలన్నింటినీ సమకూర్చుకోవడంలో భాగంగా బార్‌కోడ్‌తో రూపొందించిన అత్యాధునిక బీఎంపీ-2 యుద్ధ వాహనాలను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ సైన్యానికి అందజేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో జరిగిన కార్యక్రమంలో జైట్లీ పాల్గొన్నారు. బార్కోడ్ ఆధారంగా వాహనం ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వాహన ప్రత్యేకతలు కూడా తెలిసిపోతాయి.
ఈ కార్యక్రమంలో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ ఎ.కె గుప్తా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఛైర్మన్ బాజపాయి, సభ్యులు ఎ.వి. శ్రీవాస్తవ్, ఓడీఎఫ్ జీఎం భరత్‌సింగ్ పాల్గొన్నారు. అలాగే పటాన్చెరు మండలం భానూరులోని బీడీఎల్ పరిశ్రమను కూడా జైట్లీ సందర్శించారు. ఐదు మెగావాట్ల సౌరశక్తి విద్యుత్తు కేంద్రంతోపాటు అస్త్ర క్షిపణి ప్రాజెక్టు భవనాలను ప్రారంభించారు.
ఈ పర్యటనలో భాగంగా అరుణ్ జైట్లీతో జీఎస్టీకి సంబంధించి కొన్ని విషయాలను కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ చర్చించారు. చింతపండుపై జీఎస్టీలో 12శాతం పన్ను విధించడంతో అమ్మకం, కొనుగోళ్లు భారంగా మారాయని, ఈ అంశాన్ని పరిష్కరించాలని ఆయన కోరారు. అలాగే పత్తి, పసుపు, మిరప వంటి ఇతర వాణిజ్య పంటలపై కూడా జీఎస్టీ ప్రభావం తీవ్రంగా పడిందని ఆయన తెలియజేశారు.
కార్యక్రమంలో అరుణ్ జైట్లీ మాట్లాడుతూ - ‘‘జన్‌ధన్ యోజన, ఆధార్, చరవాణులు కలిసి ఓ సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ఏకీకృత విపణిని సృష్టించినట్లే... ఈ మూడూ కలిసి (జామ్) ‘‘ఏకీకృత ఆర్థిక, డిజిటల్ వేదిక’’ను సిద్ధంచేశాయి. `100 కోట్లు-100 కోట్లు-100 కోట్లు` లక్ష్యానికి మన దేశం చేరువలో ఉంది. అంటే వంద కోట్ల ఆధార్ నంబర్లు, వంద కోట్ల బ్యాంకు ఖాతాలు, వంద కోట్ల చరవాణులతో అనుసంధానించడమన్నమాట` అని అన్నారు.