: 10 వేలు దాటిన భూమా మెజారిటీ... 'భూమన్నా...' అని నినాదాలతో హోరెత్తుతున్న నంద్యాల!


నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంబరాలు ప్రారంభమయ్యాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభం కాగా, ఐదు రౌండ్లు ముగిసేసరికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం దాదాపు ఖరారైంది. ఆయన వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై తన ఆధిక్యాన్ని 10 వేల ఓట్లకు పైగానే పెంచుకున్నారు. తొలి రౌండ్ నుంచే శిల్పాపై స్పష్టమైన ఆధిక్యంతో భూమా కొనసాగుతుండగా, ఫలితాల సరళి స్పష్టం కావడంతో తెలుగుదేశం కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి వైకాపా నేతలు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుండగా, టీడీపీ కార్యకర్తల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. కౌంటింగ్ కేంద్రం వద్ద కార్యకర్తలు 'భూమన్నా...' అంటూ నినాదాలు చేస్తుండగా, బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని చెదరగొట్టారు. పలు కూడళ్లలో టీడీపీ కార్యకర్తలు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.

  • Loading...

More Telugu News