: ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడికి వెళతాడు.. ‘స్మార్ట్ సిటీ’ చేస్తామంటాడు : చంద్రబాబుపై జగన్ విమర్శలు
ఎక్కడ ఎన్నికలొస్తే అక్కడికి వెళతాడు, ‘స్మార్ట్ సిటీ’ చేస్తామంటాడు అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. కాకినాడ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ, మొన్న నంద్యాల ఉపఎన్నికలప్పుడే దానిని స్మార్ట్ సిటీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, గతంలో కర్నూలులో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారని, ఇప్పుడు.. కాకినాడను అద్భుతంగా చేస్తామంటూ చెబుతున్న బాబు మాటలను నమ్మవద్దని ఓటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం యూనివర్శిటీ స్థాపిస్తామని, కాకినాడలో మరో పోర్ట్ ఏర్పాటు చేస్తామని, పెట్రో కారిడార్, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు, నౌక నిర్మాణా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామంటూ మొదలైన హామీలను ఇచ్చిన చంద్రబాబు వాటి ఊసెత్తడం లేదంటూ విమర్శించారు.