: రామ్ రహీమ్‌కి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదు... స్పష్టం చేసిన హర్యానా జైళ్ల డీజీపీ
రేప్ కేసులో దోషిగా అరెస్టైన బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కి రోహ్‌తక్‌లోని సునారియా జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం లేదని హర్యానా జైళ్ల శాఖ డీజీపీ కేపీ సింగ్ స్పష్టం చేశారు. అందరు ఖైదీల్లాగే రామ్ రహీమ్‌ను కూడా చూస్తున్నామని ఆయన తెలిపారు. ఆయన కారాగారం చుట్టూ నలుగురు పోలీసులను కాపలా ఉంచడంతో పాటు, జైలులోని ఇతర ఖైదీలకు ఆయనను దూరంగా ఉంచినట్లు ఆయన చెప్పారు.
జైలుకు లోపలి వైపు కూడా రక్షణ బలగాలను మోహరించినట్లు ఆయన వివరించారు. అలాగే సునారియా జైలు చుట్టుపక్కల కిలోమీటర్ వరకు స్థానిక ప్రభుత్వ సహకారంతో పోలీసు బలగాలను ఉంచినట్లు కేపీ సింగ్ చెప్పారు. పంజాబ్, హర్యానా లలో బాగా ఫాలోయింగ్ ఉన్న బాబా గుర్మీత్ లాంటి ఖైదీలకు రక్షణ కల్పించడాన్ని తాము ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అందరు ఖైదీల్లాగే గుర్మీత్ కూడా నేల మీదే పడుకుంటున్నాడని, అతనికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తున్నట్లు వస్తున్న పుకార్లను నమ్మొద్దని ఆయన పిలుపునిచ్చారు.