: డేరా బాబా ఆశ్రమంలో 'పితాజీ మాఫీ' అనే కోడ్.. !
రేప్ కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ సింగ్ రోహ్ తక్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. 28న ఆయనకు శిక్ష ఖరారుకానుంది. ఈ క్రమంలో ఆయన ఆశ్రమానికి సంబంధించిన పలు విషయాలు వెల్లడవుతున్నాయి. పితాజీ మాఫీ... అనే దాన్ని అక్కడ ఓ కోడ్ గా ఉపయోగిస్తారు. వాస్తవానికి పితాజీ మాపీ అంటే నాన్న క్షమించాడని అర్థం... కానీ ఇక్కడ మాత్రం గుర్మీత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని అర్థం. ఈ విషయాన్ని రేప్ కు గురైన మహిళలు సీబీఐ కోర్టుకు తెలిపారు.
ఆశ్రమంలోని అండర్ గ్రౌండ్ లో గుర్మీత్ కు గుఫా అనే ఓ పర్సనల్ రూమ్ ఉంటుందట. ఇక్కడే మహిళలపై గుర్మీత్ అత్యాచారాలకు పాల్పడుతుంటారట. అత్యాచారం సమయంలో... తాను దేవుడి అవతారమని బాధితురాళ్లకు చెబుతుంటారట. మరో విషయం ఏమిటంటే... ఆ గుఫాకు కాపలాగా మహిళలే ఉంటారట. గుర్మీత్ భావనల పట్ల ప్రభావితమైన మహిళలు ఆయన ఆశ్రమంలో ఉండేందుకు ఇష్టపడతారు. దీన్ని అవకాశం తీసుకుని ఆయన మహిళలను ముగ్గులోకి లాగి, గుఫాలోకి తీసుకెళ్లి అత్యాచారం చేస్తారట. బయట ఎవరికీ తెలియకూడదని గుర్మీత్ భయపెట్టడంతో, బాధితురాళ్లు ఎవరూ ఆ ఘోరాన్ని బయటకు వెల్లడించరు.
యమునానగర్ కు చెందని ఓ బాధితురాలు సీబీఐ కోర్టు విచారణలో మాట్లాడుతూ, తొలుత తనకు పితాజీ మాఫీ అంటే అర్థమయ్యేది కాదని... 'నీకు పితాజీ మాఫీ అయిందా?' అని అక్కడి వాళ్లు అడుగుతుంటే ఏమీ అర్థం అయ్యేది కాదని... 1999 ఆగస్ట్ 28న గుర్మీత్ తనను రేప్ చేసిన తర్వాత పితాజీ మాఫీ గురించి తెలిసిందని తెలిపింది.