: పులి పిల్లను పిల్లి అని చెప్పి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడు... అరెస్ట్ చేసిన కస్టమ్స్ పోలీసులు
జంతువులను స్మగ్లింగ్ చేసే ముఠాకు చెందిన 18 ఏళ్ల అమెరికన్ యువకుడు పులి పిల్లను పిల్లి అని చెప్పి పోలీసుల కళ్లుగప్పేందుకు ప్రయత్నించాడు. అది గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి పులి పిల్లను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాలిఫోర్నియాలోని ఓటీ మెసా చెక్పోస్ట్ వద్ద యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఆ తనిఖీలో భాగంగా ఒక కారులో పులి పిల్ల కనిపించింది. ఆ కారులో ఉన్న యువకుణ్ని ప్రశ్నించగా అది తమ పెంపుడు పిల్లి అని దబాయించాడు. ఆ జంతువు పులి పిల్ల అని గుర్తించిన పోలీసులు కొంచెం గట్టిగా అడగ్గా దాన్ని మెక్సికో నుంచి కాలిఫోర్నియాకు అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని యువకుడు అంగీకరించాడు. దీంతో యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. పులి పిల్లను శాండియాగో గ్లోబల్ జూకి తరలించారు.