: మరోసారి క్షిపణి పరీక్షలకు తెగించిన కిమ్ జాంగ్
కొన్ని రోజుల పాటు సంయమనం పాటించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ మళ్లీ తనదైన శైలిలో రెచ్చిపోయారు. శనివారం నాడు వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలను హడలెత్తించారు. ఉత్తర కొరియా ప్రయోగించిన మూడు క్షిపణులు జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహించిన సంయుక్త యుద్ధ విన్యాసాల అనంతరం ఉత్తర కొరియా ఈ పరీక్షలను నిర్వహించింది. తమ దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకే ఈ రెండు దేశాలు యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నాయని ఉత్తర కొరియా భావిస్తోంది. అయితే, ఉత్తర కొరియా పరీక్షించిన క్షిపణుల్లో మొదటిది, మూడవది లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యాయి. రెండో క్షిపణి మాత్రం లక్ష్యాన్ని ఛేదించిందని అమెరికాకు చెందిన పసిఫిక్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇవన్నీ స్వల్ప శ్రేణి క్షిపణులు మాత్రమేనని తెలిపింది. తాజాగా, ఉత్తర కొరియాకు దీటుగా జపాన్ కూడా సైనిక విన్యాసాలను ఆరంభించిన సంగతి తెలిసిందే.