: యోగాతో మనోనిబ్బరం, ఆరోగ్యమే కాదు గుండెజబ్బులకు కూడా చెక్ పెట్టొచ్చు!
యోగాతో గుండె నిబ్బరం, ఆరోగ్యం సొంతం చేసుకోవడమే కాదు గుండె జబ్బులను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. యోగా, ధ్యాన సాధన ద్వారా ఆ ఫలితాలను పొందవచ్చని ఆ పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మూడు నెలల కాలంగా నిత్యం యోగా, ధ్యాన ప్రక్రియలను అవలంబిస్తున్న వారిపై ఈ పరిశోధనలు చేపట్టారు. మెదడును ఉత్తేజపరిచే బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ట్రోఫిక్ ఫ్యాక్టర్ (బీడీఎన్ఎఫ్) కారకాలు వీరిలో అధికమొత్తంలో ఉద్దీపనం చెందుతుంటాయనే విషయం ఈ పరిశోధనలో వెల్లడైంది.
అయితే, మూడు నెలల కాలంగా నిత్యం యోగా, ధ్యాన ప్రక్రియలను అవలంబించిన వారు శాకాహారం భోజనం మాత్రమే తీసుకోవడం గమనార్హం. యోగా చేసే సమయంలో విభిన్న భంగిమల్లో శరీరాన్ని వంచడం, ఉచ్ఛ్వాసనిశ్వాసలను గమనించడం, యోగ ముద్రలో ఉండి తదేకంగా మంత్ర పఠనం చేయడం ద్వారా ఉద్వేగం, ఆందోళన వంటివి దరిచేరవనే విషయం తమ పరిశోధనల్లో స్పష్టమైనట్టు అధ్యయన బృందంలో ఒకరైన సదరన్ కాలిఫోర్నియా యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్ బారుచ్ రియాల్ కాహ్న్ తెలిపారు.