: మట్టి గణపతిని ప్రతిష్టించాలంటూ ముస్లిం దంపతుల ప్రచారం... ట్వీట్ ద్వారా మెచ్చుకున్న కేటీఆర్
2013 నుంచి వినాయక చవితి సందర్భంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడి విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్న ముస్లిం దంపతులను మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు. వీళ్ల గురించి తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ సుభానీ, సలీమాల గురించి ఆ ప్రాంతంలో చాలా మందికి తెలుసు.
సుభాన్ ధోతి ధరించి, చొక్కా లేకుండా, శరీరం మొత్తం మట్టి రంగు రుద్దుకుని, మట్టి వినాయకుడి ఆకారంలో చేసిన తల మాస్క్ ను ధరించి రిక్షా మీద గణపతి లాగా కూర్చుంటాడు. ఆ రిక్షాను సలీమా వీధుల గుండా తోసుకుంటూ వెళ్తూ మట్టి వినాయకుడి ప్రాముఖ్యతను వివరిస్తుంటుంది. వీరు ప్రతి ఏడాది వినాయక చవితికి ఇలాగే వినూత్న రీతిలో మట్టి వినాయకులను ప్రతిష్టించాలని ప్రచారం చేస్తుంటారు.