: `గ్రీన్ టీ`కి ప్రత్యామ్నాయం `ఆలివ్ టీ`... రాజస్థాన్ ఆరోగ్య శాఖ కొత్త ఉత్పత్తి
దేశంలో ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రీన్ టీ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. అయితే త్వరలో గ్రీన్ టీకి ప్రత్యామ్నాయంగా ఆలివ్ ఆకుల నుంచి తయారుచేసిన టీని దేశంలో ప్రవేశ పెట్టనుంది రాజస్థాన్ ప్రభుత్వం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయినట్లు, తమ ముఖ్యమంత్రి వసుంధర రాజే నుంచి అనుమతి లభించగానే ఈ టీని మార్కెట్లో విడుదల చేస్తామని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభులాల్ సైనీ తెలిపారు. దీనికి `ఆలిటీయా` అని పేరు పెట్టినట్లు ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్ సహకారంతో 2007 నుంచి రాజస్థాన్లో 5వేల ఎకరాల్లో ఆలివ్ చెట్లు సాగు చేస్తున్నారు. ఆలివ్ ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకంగా దేశంలో మొదటిసారిగా బికనీర్ ప్రాంతంలో ఆలివ్ రీఫైనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసిన సైనీ, ఆలివ్ ఆకుల వల్ల కలిగే లాభాల గురించి పరిశోధన చేయించారు. వీటి వల్ల చాలా ఆరోగ్యకర ఉపయోగాలు ఉన్నాయని తేలడంతో వాటిని దేశ ప్రజలకు చేరువచేసేందుకు `ఆలివ్ టీ` ఉత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టినట్లు సైనీ వివరించారు. ఈ టీ సేవించడం వల్ల కేన్సర్ దరిచేరకుండా చూసుకోవచ్చని, ఈ టీని వివిధ రుచుల్లో త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. యూకే, అమెరికా దేశాలు కూడా ఆలివ్ టీ ఉత్పత్తిపై మొగ్గు చూపుతున్నాయని ఆయన అన్నారు.