: టీడీపీకి రాజీనామా చేయనున్న సినీ నటి కవిత!
సినీ నటి కవిత త్వరలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. పార్టీలో ఆర్య వైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని గత కొంత కాలంగా విమర్శలు చేస్తున్న ఆమె, కష్టపడిన వారికి గుర్తింపు లభించడం లేదన్న ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అనుచరుల వద్ద ప్రస్తావించిన ఆమె, ఎమ్మెల్సీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు వైశ్యులకు దక్కలేదని, తనకు ఎమ్మెల్యే సీటిస్తానని చెప్పి కూడా ఇవ్వలేదని ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారని, ఎన్టీఆర్ ఉన్నప్పటి టీడీపీ, ఇప్పుడున్న పార్టీకి పోలిక లేదని కూడా వ్యాఖ్యానించారని సమాచారం. ఈ సంవత్సరం మహానాడులో తనను అవమానించారని, తనతో కన్నీరు పెట్టించారని కవిత వాపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆమె వైకాపాలో చేరుతారని కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. బీజేపీ వైపు చూస్తున్నట్టు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కవిత ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయం వేచి చూడాలి.