: తమిళ బిగ్‌బాస్‌పై మరో వివాదం... కులాన్ని కించపరుస్తున్నారంటూ కమలహాసన్‌పై కేసు!
తమ కులం ఎంతో పవిత్రంగా భావించే `నాదస్వరం` వాయిద్యాన్ని బిగ్‌బాస్ షోలో కించపరిచారని ఇసై వెల్లలార్ కులాధ్యక్షుడు కేఆర్ కుహేశ్ చెన్నై మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. జూలై 14న ప్రసారమైన బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో పార్టిసిపెంట్ శక్తి నాదస్వరాన్ని చేతిలో అటు ఇటూ ఊపుతూ, తమ మనోభావాలను దెబ్బతీశాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తమకు ఎంతో పవిత్రమైన వాయిద్యాన్ని భోజనం చేసే ముందు డైనింగ్ టేబుల్ మీద ఉంచడం కూడా దుశ్చర్యేనని, ఇందుకు కమలహాసన్ క్షమాపణలు తెలియజేయాలని ఆయన చెప్పారు.
ఈ మేరకు ఆయన కమల్‌తో పాటు బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎండమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పార్టిసిపెంట్ శక్తిపై కూడా ఫిర్యాదు చేశారు. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం ఇలా ఇతర కులాల పవిత్ర వాయిద్యాలను, పూజా వస్తువులను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీయడం సబబు కాదని కుహేశ్ అన్నారు.