: ట్రిపుల్ తలాక్ చెల్లదు.. నిషేధం విదిస్తున్నాం!: కీలక తీర్పిచ్చిన సుప్రీంకోర్టు


ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయంలో పార్లమెంట్ లో ఓ చట్టం చేయాల్సి వుందని, అంతవరకూ తమ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేస్తూ, ఇంజక్షన్ ఆర్డర్ వేసింది. ఈ విషయంలో ప్రభుత్వం చట్టం చేసేంత వరకూ తమ ఆర్డర్ అమలవుతుందని పేర్కొంది. అసలు కేసులో తాము కల్పించుకోవాలన్న ఉద్దేశం లేదని, అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, తాత్కాలిక ఆదేశాలు ఇస్తూ, నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ కే వదిలేస్తున్నట్టు తెలిపింది.

ముస్లిం సమాజంతో పాటు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పిచ్చింది. సుదీర్ఘకాలంగా వాదనలు విన్న న్యాయస్థానం, ట్రిపుల్ తలాక్ పై ఆరు నెలల పాటు స్టే విధిస్తున్నామని, ఈలోగా చట్ట సవరణ చేసి, ట్రిపుల్ తలాక్ చెల్లకుండా పార్లమెంటులో నూతన చట్టం తేవాలని కోరింది.

ఇన్ స్టంట్ గా మూడు సార్లు తలాక్ చెప్పడం ద్వారా భార్యను వదిలించుకోవాలని చూడటం అత్యంత హేయమైన చర్యని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయపడింది. ఫోన్ లేదా సామాజిక మాధ్యమాల్లో తలాక్ చెప్పడం చట్ట సమ్మతం కాదని, అటువంటివి చెల్లబోవని పేర్కొంది. కొత్త చట్టం తెచ్చేటప్పుడు ముస్లిం లాబోర్డు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్ కు సుప్రీంకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News