: తెలంగాణలో రైతు సమస్యలకు మూడు నెలల్లోగా కమిషన్ ఏర్పాటు చేయాలి: హైకోర్టు ఆదేశాలు
తెలంగాణలో రైతు సమస్యలు, వివాదాల పరిష్కారం నిమిత్తం మూడు నెలల్లోగా ఓ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఈ రోజు మరోసారి విచారణ జరిపింది. రైతు కమిషన్ ను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు గతంలో ప్రశ్నించింది.
మూడు నెలల్లో కమిషన్ ఏర్పాటు చేస్తామని ఈ రోజు జరిగిన విచారణలో హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏర్పాటు చేయబోయే కమిషన్ లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సహా ఐదుగురు సభ్యులు కమిషన్ లో ఉండాలని ఈ ఆదేశాల్లో హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, రైతు సమస్యల పరిష్కారానికి చట్టప్రకారం కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆ పిల్ లో ఇంద్రసేనారెడ్డి కోరారు.