: ఇక్కడ దాడి.. అక్కడ నిరసనలు
పాకిస్తాన్ జైల్లో తోటి ఖైదీల దాడిలో భారతీయ ఖైదీ సరబ్ జిత్ మరణించి ఓ రోజు గడిచిందో లేదో ప్రతీకారం జరిగిపోయింది! జమ్మూకాశ్మీర్ జైల్లో పాక్ ఖైదీ సనావుల్లా రంజాయ్ పై భారత మాజీ సైనికుడు వినోద్ కుమార్ దాడి చేశాడు. సరిగ్గా సరబ్ జిత్ కు ఎలాంటి గాయాలయ్యాయో సనావుల్లాకు అలాంటి దెబ్బలే తగిలాయి. తలపై తగిలిన తీవ్రగాయమే సరబ్ జిత్ మరణానికి కారణం అని అక్కడి వైద్యులు తమ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
తాజాగా సనావుల్లాకు సైతం తలపైనే బలమైన గాయమైంది. ప్రస్తుతం ఈ పాక్ జాతీయుడు సృహలో లేడు. పరిస్థతి ఇంకా విషమంగానే ఉంది. ఇదిలావుంటే, తమ దేశ ఖైదీపై భారత్ జైల్లో దాడి జరగడం పట్ల పాక్ జాతీయులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ముఖ్య పట్టణం ముజఫరాబాద్ లో 200 మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ర్యాలీ జరిపారు. త్రివర్ణ పతాకాన్ని దహనం చేయడమే కాకుండా, భారత దళాలకు వ్యతిరేకంగా 'జిహాద్' తలపెట్టాలని నినదించారు.